ముంబై, అక్టోబర్ 6: ప్రముఖ నటుడు, రామాయణం టీవీ సీరియల్లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది (82) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చింది. ఇక్కడ కాందివలీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మూడున్నర దశాబ్దాల కిందట దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం సీరియల్లో రావణుడిగా నటించడంతో ఆయన పేరు అందరికీ సుపరిచితమైంది. ఆయన నటించిన ‘విక్రమ్ ఔర్ భేతాళ్’ టీవీ సీరియల్ కూడా ప్రేక్షకాదరణ పొందింది. 300 హిందీ, గుజరాతీ సినిమాల్లో ఆయన నటించారు. 1991లో సాబర్ కాంఠా నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. త్రివేది మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.