న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. నవంబర్లో జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు ఆప్ సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలో జనతా కీ అదాలత్లో కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే రెట్టింపు అవినీతి, రెట్టింపు దోపిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం. మీరు పొరపాటున బీజేపీకి ఓటేస్తే మీకు మా సర్కారు ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు, నీళ్లు, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు, ఆరోగ్యం, విద్య అదృశ్యమైపోతాయి’ అని కేజ్రీవాల్ అన్నారు.