న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) ఆరోగ్యం సరిగా లేదు. ఆయన 4.5 కేజీల బరువు తగ్గారు. మార్చి 21వ తేదీన ఆయన్ను మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులోని రెండవ సెల్లో ఉంటున్నారు. కేజ్రీ బరువు తగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ జైలు అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని వెల్లడిస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.
14X8 ఫీట్ల వెడల్పు ఉన్న సెల్లో ఆయన్ను బంధించారు. కేజ్రీ బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమంగా మారుతున్నట్లు జైలు డాక్టర్లు చెబుతున్నారు. ఓ దశలో 50 కన్నా తక్కువ షుగర్ నమోదు అయినట్లు రిపోర్టులో ఉన్నది. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు మెడిసిన్స్ ఇస్తున్నట్లు చెప్పారు. లంచ్, డిన్నర్ కోసం ఆయనకు ఇంటి భోజనం పెడుతున్నారు. ఆయన కండీషన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ కోసం ఆయన సెల్ వద్ద క్విక్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.