న్యూఢిల్లీ : ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రం తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాషాయ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కార్పొరేట్ సంపన్నుల రుణాలను రూ 10 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం మరోవైపు పేదలపై పన్ను భారాలు మోపుతోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. బియ్యం, గోధుమలను కొనుగోలు చేసే యాచకుడు, నిరుపేద సైతం పన్ను చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొందని అన్నారు.
అత్యంత పేదలపైనా పన్ను భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గింపు, ఆహారోత్పత్తులపై జీఎస్టీ, జాతీయ ఉపాధి హామీ పధకంలో 25 శాతం కోత విధించడం ద్వారా సమకూరిన నిధులు ఏమవుతున్నాయని కేజ్రీవాల్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ద్వారా ఏటా రూ 3.5 లక్షల కోట్లు కేంద్రం వసూలు చేస్తోందని మరోవైపు సైనికులకు పెన్షన్ చెల్లించేందుకు కూడా నిధుల లేమిని సాకుగా చూపుతోందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.