ఢిల్లీ : ఆప్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదిరింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, ఒక్కో ఎమ్మెల్యేలకు రూ 20 కోట్ల చొప్పున ప్రలోభాలకు గురిచేసేందుకు ఆ పార్టీ రూ 800 కోట్లు సిద్ధం చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలతో కలిసి గురువారం రాజ్‌ఘాట్‌ను సందర్శించిన అనంతరం కేజ్రీవాల్ కాషాయ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ ఆపరేషన్ లోటస్ విఫలం కావాలని కోరుతూ ఆప్ ఎమ్మెల్యేలు రాజ్‌ఘాట్‌ను సందర్శించి ప్రార్ధనలు జరిపారు. అంతకుముందు కేజ్రీవాల్ అధ్యక్షతన ఆయన నివాసంలో ఆప్ ఎమ్మెల్యేల కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి 53 మంది ఎమ్మెల్యేలు హాజరై కేజ్రీవాల్ నాయకత్వానికి సంఘీభావం తెలిపారని ఆప్ ప్రతినిధి సౌరవ్ భరధ్వాజ్ వ్యాఖ్యానించారు. భేటీకి హాజరు కాని ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ ఫోన్లో మాట్లాడారాని వారంతా తుదిశ్వాస విడిచేవరకూ మీ వెంటే ఉంటామని చెప్పారని తెలిపారు.
సమావేశానంతరం భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని అన్నారు. సిసోడియా నివాసంపై జరిగిన దాడుల్లో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ 20 కోట్లు ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన భేటీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని, వారంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు.