సూరత్: బీజేపీ పాలిత గుజరాత్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు.
ఈ ఏడాది డిసెంబర్లో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని గృహ వినియోగదారులందరికీ నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తామని హామీ ఇచ్చారు. సూరత్ నగరంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘గృహ వినియోగదారులందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తాం. అన్ని నగరాలు, గ్రామాల్లో 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తాం అని’ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తమ పార్టీకి రాష్ట్రాన్ని పాలించే అవకాశం వస్తే.. డిసెంబర్ 31, 2021 వరకున్న అన్ని పాత విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ ప్రకటించారు. తమ పార్టీ గుజరాత్లో అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఏంచేస్తామనేది ఎజెండా రూపంలో ముందుంచుతామని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులకు అదిరిపోయే పంచ్
కేజ్రీవాల్ రాష్ట్ర పర్యటనకు ముందు గుజరాత్ బీజేపీ యూనిట్ చీఫ్ సీఆర్ పాటిల్ మాట్లాడుతూ..ప్రజలు మిఠాయి సంస్కృతి (రేవడి కల్చర్)కి అలవాటుపడి తప్పుదారి పట్టవద్దని హెచ్చరించారు. ఇది చివరికి రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలాగా మార్చగలదన్నారు. వారంక్రితం ప్రధాని మోదీకూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేజ్రీవాల్ అదిరిపోయే పంచ్ ఇచ్చారు.
మిఠాయిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తే దాన్ని ప్రసాదం అంటారని, కానీ సొంత స్నేహితులు, మంత్రులకు ఉచితంగా ఇచ్చినప్పుడు దాన్ని పాపం అని అంటారని చలోక్తి విసిరారు. రేవడి అనేది ఉత్తర భారతదేశంలో పండుగల సమయంలో ప్రత్యేకంగా పంపిణీ చేసే ఒక ప్రసిద్ధ స్వీట్.