Arvind Kejriwal : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో వేర్వేరుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్య పరస్పర ఒప్పందం కుదిరిందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో సీట్ల సర్ధుబాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
కేజ్రీవాల్ ఆదివారం కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి నివాసానికి వెళ్లి విందు భేటీలో పాల్గొన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీ చేయడం పట్ల విభేదాలేమీ తలెత్తబోవని అన్నారు. పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్ధులుగా తలపడుతుండగా, ఈ రెండు పార్టీలు విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు కావడంతో ఈ వ్యవహారంపై కొద్ది వారాలుగా హాట్ డిబేట్ సాగుతోంది.
అయితే ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు లేకుంటే బీజేపీ సులభంగా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు జాతీయ స్ధాయిలో బీజేపీని ఓడించే లక్ష్యానికి కట్టుబడి ఉంటూనే తమ ప్రాబల్య ప్రాంతాల్లో పట్టును కొనసాగించాలని కేజ్రీవాల్ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు.