Arvind Kejriwal | లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలకానున్నారు. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దని.. కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, సీబీఐ అరెస్టు చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన అవినీతి కేసులో ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
బెంచ్‌లో జస్టిస్ ఉజ్వల్ భుయాన్ సైతం ఉన్నారు. కేజ్రీవాల్ పిటిషన్లపై ఇప్పటికే ఇరువర్గాల వాదనలు విన్న బెంచ్ 5న కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా తీర్పును వెలువరించింది. కేజ్రీవాల్‌కు గతంలో సుప్రీంకోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సీబీఐ కేజ్రీవాల్‌ని అరెస్టు చేయడాన్ని ఇన్సురెన్స్ అరెస్టుగా పేర్కొన్నారు. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. మద్యం పాలసీ కేసులోని సొత్తును 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని తెలిపారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంపై సైతం అభ్యంతరం తెలిపారు. బెయిల్ కోసం ముఖ్యమంత్రి ఎప్పుడూ ట్రయల్ కోర్టును ఆశ్రయించలేదన్నారు.