న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు భారీ ఉపశమనం కలిగించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని పేర్కొన్న కోర్టు.. కేజ్రీవాల్ ఆధారాలను ట్యాంపర్ చేస్తారనే వాదనను తిరస్కరించింది.
సుదీర్ఘంగా నిర్బంధించడం అన్యాయంగా స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది. రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరి జామీను సమర్పించాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కేసు గురించి బయట ఏమీ మాట్లాడవద్దని షరతు విధించింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పుడు ఆయన తన కార్యాలయానికి గానీ, ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లవద్దని, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి కోసం తప్పనిసరి అయితే తప్ప ఏ ఫైలు పైనా సంతకం చేయవద్దని కోర్టు నిబంధనలు విధించింది. ఈ షరతులు ఇప్పుడు కూడా పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసే తీర్పుతో ఏకీభవించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్.. ప్రత్యేకంగా 31 పేజీల తీర్పు రాశారు. సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని ఆయన తప్పుబట్టారు. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పుడే అరెస్టు చేయడం అంటే ఆయనను నిరాశపర్చడమే సీబీఐ లక్ష్యమని పేర్కొన్నారు. 22 నెలలుగా లేని తొందర ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పుడే సీబీఐకి ఏముందనేది అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారనే కారణంతో అరెస్టు చేసి, నిర్బంధాన్ని కొనసాగించడాన్ని సీబీఐ సమర్థించుకోలేదని పేర్కొన్నారు. సహకరించకపోవడం అంటే నేరాన్ని అంగీకరించడం కాదని స్పష్టం చేశారు. ‘పంజరంలో చిలక’ అనే భావనను సీబీఐ తొలగించుకోవాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈడీ కేసులో ఇవే కారణాలతో బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా కేజ్రీవాల్‌ను కస్టడీలో పెట్టడమంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని అన్నారు. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు విధించిన బెయిల్ షరతులపైనా తనకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఈ షరతులు కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకుండా, ఫైళ్లపై సంతకాలు చేయకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు. అయితే, ఇది ప్రత్యేక ఈడీ కేసు కాబట్టి న్యాయపరమైన క్రమశిక్షణ వల్ల ఈ నిబంధనలపై తాను మాట్లాడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10 నుంచి జూన్ 1 వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. జూన్ 2న ఆయన మళ్లీ జైలులో లొంగిపోగా, జూన్ 20న ట్రయల్ కోర్టులో బెయిల్ దక్కింది. బెయిల్‌ను ఈడీ సవాల్ చేయడంతో జూన్ 25న హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. జూన్ 26న ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. జూలై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సీబీఐ అప్పటికే అరెస్టు చేయడం వల్ల ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. సీబీఐ కేసులోనూ బెయిల్ దక్కడంతో శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.
కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం బీజేపీకి చెంపపెట్టు అని ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఈడీ, సీబీఐని ఉపయోగించుకొని ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడానికి బీజేపీ సిగ్గుపడాలని ఆయన అన్నారు. నియంతృత్వాన్ని ఆపేయాలని సుప్రీంకోర్టు బీజేపీకి పెద్ద సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు.
జైలు నుంచి విడుదలయ్యాక కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశాన్ని బలహీనం చేసేందుకు పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులతో పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ‘నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు. నా ప్రతి రక్తపు చుక్క దేశ సేవకే అంకితం. నా జీవితంలో ఎన్నో కష్టాలను చూశాను. ప్రతిసారి దేవుడు నా వెంట ఉన్నాడు. నన్ను బలహీనం చేయాలని జైల్లో పెట్టారు, కానీ నా సంకల్పం మరింత బలోపేతమైంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.