Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 5న కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనున్నది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఆదివారం తీహార్ జైలులో లొంగిపోనున్నారు. ఆరోగ్య కారణాల నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్‌ను కోరిన విషయం తెలిసిందే. పీఈటీ, సిటీ స్కాన్‌తో పాటు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని.. ఈ పరీక్షలకు ఏడురోజులు సమయంపడుతుందని పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో ఈడీ కేజ్రీవాల్ అరెస్టు చేసిన తర్వాత ఆయన ఏడు కిలోల వరకు బరువు తగ్గినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
పలు ఆరోగ్య కారణాలతో ఆయన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఎన్నికల ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్‌కు జూన్ ఒకటి వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. ఆయనకు నేర చరిత్ర లేకపోవడం, తీవ్రమైన ఆరోపణలు ఉన్నా దోషిగా తేలకపోవడంతో ఆంక్షలతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, సాక్ష్యులను ప్రభావితం చేసేలా ప్రవర్తించవద్దని.. ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పింది. రూ.50వేల పూచీకత్తుపై బెయిల్‌ను ఇచ్చిన కోర్టు జూన్ 2న తిరిగి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన ఆదివారం కోర్టులో లొంగిపోనున్నట్లు ప్రకటించారు.