న్యూఢిల్లీ, డిసెంబర్ 25: బీజేపీ ప్రోద్బలంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని తప్పుడు కేసులోఅరెస్టు చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులో అతిశీని అరెస్టు చేయాలని దర్యాప్తు సంస్థలను బీజేపీ ఆదేశించినట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం చేయకుండా ఆప్‌ను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో కేజ్రీవాల్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మహిళలకు రూ.1100 చొప్పున బీజేపీ నగదును పంపిణీ చేస్తోందని ఢిల్లీ సీఎం, ఆప్ సీనియర్ నేత ఆతిశీ బుధవారం ఆరోపించారు.
ఆప్, దాని జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్‌తో పొత్తు పెట్టుకోవడం తాము చేసిన పొరపాటని ఆ పార్టీ నాయకుడు అజయ్ మాకెన్ తెలిపారు. ఆ తప్పును సరిదిద్దుకోవాల్సి ఉందన్నారు.