న్యూఢిల్లీ : వచ్చే వారం గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొగ్గుచూపుతుందా అని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రశ్నించారు. ఆప్‌ను చూసి కాషాయ పార్టీ భయపడుతోందని ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు.
వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగాల్సిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోందని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. హిమాచల్, గుజరాత్లో తమ పార్టీని చూసి బీజేపీ బెంబేలెత్తుతోందని వ్యాఖ్యానించారు. వారు ఆప్‌ను చూసి కాదు ప్రజలను చూసి భయపడుతున్నారని చెప్పుకొచ్చారు.
ఆప్‌కు లభిస్తున్న ఆదరణతో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు బీజేపీ వెళుతోందని చెప్పారు. కాషాయ పార్టీ ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా అధికారం సామాన్యుడికే అందుతుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో ఆప్ ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తోంది.