పనాజీ : గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే హిందువులకు అయోధ్య, క్రైస్తవులకు వేలాంకని, ముస్లింలకు అజ్మీర్‌కు ఉచిత యాత్రా సౌకర్యం కల్పిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. షిర్డీ సాయిబాబాను ఆరాధించే వారి కోసం ఉచిత షిర్డీ యాత్ర అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
గోవాలో సోమవారం జరిగిన ఓ ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై ఎవరు అధికారంలోకి వచ్చినా మరో పార్టీపై చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే గోవా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు యువతకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.