(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రక్తదానం చేయడమంటే ఒకవిధంగా ప్రాణాన్ని పోయడమే. ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తం ఎక్కించడం అత్యవసరం. మన దేశంలో ప్రతీ రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరపడుతుంది. అయితే, రక్తదాతలు సమయానికి అందుబాటులో లేకపోవడం, నిల్వ ఉన్న రక్తం పాడైపోవడం, దాతలు అందుబాటులో ఉన్నప్పటికీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం, అరుదైన బ్లడ్ గ్రూప్ అవసరపడటం వెరసి సరైన సమయంలో రక్తం అందకపోవడం వల్ల ఏటా మన దేశంలోనే 12 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు అంచనా. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే దిశగా జపాన్ పరిశోధకులు ఓ అరుదైన ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేశారు. అదే ‘ఆర్టిఫిషియల్ బ్లడ్’ (కృత్రిమ రక్తం). వైద్య చరిత్రలో దీన్ని ఓ గేమ్‌ఛేంజర్‌గా చెప్తున్నారు.
శరీరంలోని రక్తానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్‌లో అభివృద్ది చేసిన బ్లడ్‌నే ఆర్టిఫిషియల్ బ్లడ్‌గా పిలుస్తున్నారు. పాడైపోయిన రక్తంలోని హెమోగ్లోబిన్ను వేరుచేసి, దాన్ని వైరస్ప్రూఫ్ షెల్‌లో ఉంచి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్‌ను అభివృద్ధి చేశారు. జపాన్‌లోని నారా మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరోమీ సకాయి, ఆమె వైద్యబృందం ఈ ఘనత సాధించారు.
క్లినికల్ ట్రయల్స్‌లో ఫలితాలు సానుకూలంగా వస్తే, 2030 నాటికి ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ అందుబాటులోకి రానున్నది. జపాన్‌లోనే కాకుండా అమెరికా, యూకే, చైనా వంటి దేశాలు కూడా ఆర్టిఫిషియల్ బ్లడ్పై పలు ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.
ప్రమాదాలు, గాయాలు, సర్జరీలు జరిగినప్పుడు పేషెంట్లకు రక్తం అవసరపడుతుంది. అయితే, దాతలు అందుబాటులో లేకపోయినా, బ్లడ్ గ్రూప్‌లు మ్యాచ్ కాకపోయినా బాధితుల ప్రాణాలను కాపాడటం కష్టంగా మారుతున్నది. దీనికి పరిష్కారంచూపించేందుకే ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్‌ను తీసుకొచ్చారు. సాధారణంగా ఎర్ర రక్తకణాలను 7 వారాలకు మించి భద్రపర్చలేం. అయితే, ఈ కృత్రిమ రక్తాన్ని సాధారణ రక్తంతో పోలిస్తే, 24 రెట్లు ఎక్కువకాలం పాటు నిల్వ ఉంచవచ్చని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు, బ్లడ్‌గ్రూప్‌తో సంబంధం లేకుండా అందరికీ ఈ రక్తాన్ని ఎక్కించే అవకాశం కూడా ఉందట. దీన్ని శాస్త్రీయంగా రుజువు చేయడానికి ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.