న్యూఢిల్లీ: అమెరికాకు అక్రమంగా వలస వెళ్లినవారితో రెండో విమానం భారత దేశానికి వస్తుండటం భారత దౌత్యానికి పరీక్ష అని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం శనివారం అన్నారు. ఈ విమానంపైనే అందరి దృష్టి ఉందని చెప్పారు. వారి చేతులకు బేడీలు, కాళ్లకు తాళ్లు కట్టి తీసుకొస్తున్నారా? అని ఎక్స్ పోస్ట్‌లో ప్రశ్నించారు. 119 మంది అక్రమ వలసదారులతో అమెరికన్ విమానం శనివారం అర్ధరాత్రి అమృత్‌సర్‌లో దిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ విమానంలో 67 మంది పంజాబీలు, 33 మంది హర్యానా, 8 మంది గుజరాత్, ముగ్గురు యూపీ రాష్ర్టాలకు చెందినవారు, కాగా గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు చెందినవారు ఇద్దరేసి ఉండొచ్చని చెప్తున్నారు. వీరు అమెరికాలో ప్రవేశించిన వెంటనే వారి పాస్‌పోర్టులను చింపేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం కూడా కేంద్రంపై విరుచుకుపడ్డారు. పవిత్ర నగరమైన అమృత్సర్ను “డిపోర్ట్ సెంటర్”గా మార్చవద్దని డిమాండ్ చేశారు.
దేశంలో అనేక వైమానిక స్థావరాలు ఉన్నాయని, వాటిలో ఎక్కడైనా ఈ విమానాలను దించవచ్చునని చెప్పారు. ఆయన శనివారం అమృత్సర్ విమానాశ్రయానికి వెళ్లి, ఏర్పాట్లను పరిశీలించారు. అమెరికా నుంచి వస్తున్నవారి కోసం భోజనాల ఏర్పాట్లు చేశామని, వారిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు వాహనాలను సిద్ధం చేశామని తెలిపారు. హర్యానాకు వెళ్లాల్సిన వారి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇంకో వైపు పంజాబ్ యువతను విదేశాలకు తరలిస్తున్న మోసపూరిత ఏజెంట్లపై చర్యలు తీసుకోవడంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విఫలమయ్యారని కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఆరోపించారు.