Digital Arrest | న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో ‘డిజిటల్ అరెస్టు’లకు సంబంధించిన నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) శనివారం ఓ అడ్వైజరీని జారీ చేసింది. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కస్టమ్స్, పోలీస్ అధికారులు లేదా జడ్జీలు వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని ఆ అడ్వైజరీలో స్పష్టం చేసింది. డిజిటల్ అరెస్టులను కుంభకోణం (స్కామ్)గా పేర్కొన్నది. ఇంటర్నెట్తోపాటు వాట్సాప్, స్కైప్ లాంటి సోషల్ మీడియా వేదికలు, వాటి లోగోలను ఉపయోగించడం ద్వారా జరిగే ఇలాంటి నేరాల బారిన పడొద్దని ప్రజలకు సూచించింది. డిజిటల్ అరెస్టులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.