అలీపూర్‌దువార్, నవంబర్ 17: దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి చెందిన నేత ఆయన.. మోదీ సర్కారు ప్రభుత్వంలో కేంద్ర మంత్రి.. పైగా, దొంగలు, దోపిడీదారులను పట్టుకొనే హోంశాఖ బాధ్యతలు. కానీ, నగలు దొంగతనం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. ఆయనే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్. అవును! 13 ఏండ్ల క్రితం జరిగిన ఒక చోరీ కేసులో ఈయనను అరెస్టు చేయాలని కోర్టు కూడా ఆదేశించింది. బెంగాల్‌లోని అలీపూర్‌దువార్ రైల్వే స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలో, బీర్‌పాడాలోని రెండు బంగారం దుకాణాల్లో 2009లో దొంగతనం జరిగింది.
ఆ కేసులో మరోవ్యక్తితో పాటుగా ప్రామాణిక్ నిందితుడిగా ఉన్నారు. అలీపూర్‌దువార్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు కోర్టు బుధవారం ఈ కేసుపై విచారణ సందర్భంగా ఆయన అరెస్టుకు వారంట్ జారీ చేసింది. ఈ నెల 11న జారీ చేసిన సమన్లకు నిశిత్ స్పందించలేదు. దీంతో ఆయనను వెంటనే అరెస్టు చేయాలని కోర్టు వారంట్ జారీ చేసింది. ‘ప్రామాణిక్‌ను అరెస్టు చేసి డిసెంబర్ 7న కోర్టు ముందు హాజరు పర్చాలి. లేకపోతే దానికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
వారంట్‌పై స్పందించేందుకు కేంద్ర మంత్రి నిశిత్ నిరాకరించారు. ప్రామాణిక్ తరఫు న్యాయవాది దులాల్ ఘోష్ మాట్లాడుతూ.. వారంట్‌పై పై కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశం మేరకు ఉత్తర 24 పరగణాల జిల్లా ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుంచి ఈ కేసును అలీపూర్‌దువార్ కోర్టుకు బదిలీచేశారు. ప్రామాణిక్ 2019లో బీజేపీలో చేరి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు గానూ తృణమూల్ నుంచి బహిష్కరించారు. నిశిత్ బంగ్లాదేశీ అని గతంలో కాంగ్రెస్ నేత రిపున్ బోరా ఆరోపిస్తూ, జాతీయతను పరిశీలించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.
కేంద్ర మంత్రి నిశిత్‌కు కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసిన నేపథ్యంలో బెంగాల్ అధికార టీఎంసీ బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరింది. రాష్ట్రపతి నుంచి సమ్మతి రాగానే పార్టీ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రెయిన్ సహా ఏడుగురు ఢిల్లీకి వెళ్లనున్నారు.