న్యూఢిల్లీ, మే 15: ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద అరెస్టయిన ‘న్యూస్‌క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టు చట్ట ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆయనను వెంటనే విడుదల చేయాలని బుధవారం ఆదేశించింది. తన అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ ప్రబీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టేసింది. ప్రబీర్ పుర్కాయస్థకు బెయిల్ మంజూరు చేసింది.