న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. తాజాగా సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దాదాపు వెయ్యి మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అదనపు కమిషనర్ చిన్మోయ్ బిస్వాల్ కూడా కరోనా బారిన పడిన వారిలో ఉన్నట్లు చెప్పారు. కరోనా సోకిన సిబ్బంది అంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు వెల్లడించారు.
మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అంతటా కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. దేశ వ్యాప్తంగా గత 8-9 రోజులుగా పాజిటివ్ కేసుల పెరుగుదలతో రోజువారీ కేసుల నమోదు సుమారు రెండు లక్షలకు చేరిందని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలో సుమారు నాలుగైదు రెట్లు ఎక్కువగా కేసులు నమోదైనట్లు చెప్పారు.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరిగాయని, ఆ తర్వాత క్రమంగా తగ్గాయని ఢిల్లీలోని బీఎస్కే హాస్పిటల్‌కు చెందిన శ్వాసకోశ వ్యాధుల హెచ్‌వోడీ డాక్టర్ సందీప్ నాయర్ తెలిపారు. మన దేశంలో కూడా అలాంటి పరిస్థితే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు లక్షల్లో పెరిగినా, మరణాల సంఖ్య నిలకడగా ఉండటం ఊరటనిస్తున్నదని అన్నారు.