(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌ను తానే నిర్మించానని, హైటెక్ సిటీనే కాదు ఛాన్స్ ఇస్తే చార్మినార్‌ను కూడా తానే కట్టానని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీ నాయకులు జాతీయ స్థాయిలో అభాసుపాలయ్యారు. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం నేపథ్యంలో జాతీయ టీవీ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఓ చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ డిబేట్లో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత దీపక్ రెడ్డి స్వామి భక్తిని చాటుకోవడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇండిగో సమస్యకు సంబంధించి జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు.
దీంతో వెంటనే స్పందించిన దీపక్ రెడ్డి.. ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు తమ లోకేశ్ బాబు వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో మండిపడ్డ అర్నబ్.. ‘అసలు లోకేశ్ ఎవరు? ఆయన ఏ పదవిలో ఉన్నారు? కేంద్రమంత్రి పదవిలో లేని వ్యక్తి, దేశ వ్యవహారాల్లో జోక్యం ఎలా చేసుకొంటారు? ఆయనకు, కేంద్ర విమానయాన శాఖకు ఏం సంబంధం? అది విమానయాన శాఖనా? టీడీపీ మంత్రిత్వ శాఖనా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో షాక్‌కు గురైన దీపక్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.