సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 10:58:56

జైలులో ఫోన్ వినియోగిస్తూ దొరికిపోయిన అర్న‌బ్!

జైలులో ఫోన్ వినియోగిస్తూ దొరికిపోయిన అర్న‌బ్!

ముంబై: ఓ కేసులో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామి జైలులో ఫోన్ ఉప‌యోగిస్తూ దొరికిపోయాడు. దీంతో అధికారులు ఆయ‌న‌ను మ‌రో జైలుకు త‌రలించారు. ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌ ఆత్మ‌హ‌త్య కేసులో అర్న‌బ్‌ను ఈనెల 4న ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆయ‌న‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. దీంతో పోలీసులు అలీబాగ్ జైలు ప‌రిధిలో క‌రోనా కేంద్రంగా మార్చిన ఓ పాఠ‌శాలలో ఉంచారు. అయితే ఆ స‌మ‌యంలో కూడా అర్న‌బ్‌ సోష‌ల్ మీడియాలో క్రియాశీల‌కంగా ఉండ‌టంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో ఆయ‌న మ‌రొక‌రి ఫోన్‌ను వినియోగిస్తున్నాడ‌ని నిర్ధార‌ణ చేసుకున్న పోలీసులు అక్క‌డి నుంచి రాయ్‌గ‌ఢ్ జిల్లాలోని త‌లోజా జైలుకు త‌ర‌లించారు.  అర్న‌బ్‌ను అరెస్టు చేసిన‌ప్పుడే ఆయ‌న ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. 


గ‌త బుధ‌వారం 53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో గోస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఓ డిజైన‌ర్‌తో పాటు ఆయ‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆ ఆర్కిటెక్ట్ కూతురు అద్యా నాయ‌క్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆ కేసులో విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు ఈ ఏడాది మేలో మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అలీబాగ్ పోలీసులు ఆ కేసులో విచార‌ణ స‌రిగా చేపట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న తండ్రి మ‌ర‌ణించిన‌ట్లు అద్యా త‌న ఫిర్యాదులో ఆరోపించింది.