శ్రీనగర్: జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి గుంతలోకి దూసుకెళ్లింది. ఆ వాహనం బోల్తాపడింది. (Army Vehicle Skids Off Road) ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సుంజియాన్ ప్రాంతంలోని గంతర్ మోర్ వద్ద ఆర్మీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తాకొట్టింది. స్థానిక ప్రజల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడిన నలుగురు సైనికులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
కాగా, గత రెండు నెలలుగా జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 24న ఒక ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోతైన లోయలో అది పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆర్మీ వాహనాలు ప్రమాదానికి గురైన మరికొన్ని సంఘటనలు కూడా ఇటీవల జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.