LAC | న్యూఢిల్లీ: తూర్పు లడఖ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. పాంగాంగ్ సో సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేసింది. లెఫ్టినెంట్ జనరల్ హితేష్ భల్లా గురువారం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ ఔన్నత్యం నిరంతరం స్ఫూర్తిదాయకమని లేహ్‌లోని 14 కోర్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది.
ధైర్యసాహసాలు, ముందుచూపు, చెక్కు చెదరని న్యాయాలకు ప్రతీక శివాజీ అని కొనియాడింది. ఇదిలా వుండగా, ఇటీవల చిట్టచివరి ఘర్షణ ప్రాంతాలైన దెమ్చోక్, డెప్సాంగ్ల నుంచి భారత్, చైనా తమ సైన్యాలను ఉపసంహరించాయి. దీంతో దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణానికి తెర పడింది.