శ్రీనగర్, మే 30: డ్రగ్ కేసులో ఆర్మీ జవాన్‌ను ప్రశ్నించారన్న ఆగ్రహంతో కొంతమంది ఆర్మీ సిబ్బంది జమ్ముకశ్మీర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన కుప్వారా పోలీస్ స్టేషన్లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో ముగ్గురు ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్స్ సహా 13 మంది జవాన్లపై కేసు నమోదు చేశారు.
ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో 160 టెరిటోరియల్ ఆర్మీకి చెందిన కొంతమంది సాయుధ జవాన్లు పోలీసుస్టేషన్‌కు వచ్చి అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేశారు. అక్కడ ఉన్న ఒక పోలీసును అపహరించుకుని పోయారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఆర్మీ సిబ్బందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఆర్మీ సిబ్బంది పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారనడంలో వాస్తవం లేదని సైనిక అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.