జమ్మూ, మే 31 : ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభినందించారు. ఈ మేరకు శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు. సరిహద్దులోని పర్గాల్ ఔట్‌పోస్ట్‌ను కమాండ్ చేస్తూ అత్యంత సమీపంలోని పాకిస్థాన్ ఔట్‌పోస్ట్‌లను ఆమె విజయవంతంగా నిలువరించారని ద్వివేది పేర్కొన్నారు.
సాంబ, ఆర్‌ఎస్‌పురా, అఖ్నూర్ సెక్టార్లలోని శత్రు శిబిరాలపై నిర్వహించిన ఆపరేషన్‌లో తన ఆధ్వర్యంలోని సైనిక బలగాలను దిశా నిర్దేశం చేయడంలో నేహా విజయం సాధించారని కొనియాడారు. నేహాతో పాటు మరో ఆరుగురు కానిస్టేబుళ్లను ఆర్మీ చీఫ్ సత్కరించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నేహా తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు.