Karnataka | మంగళూరు, జనవరి 17: కర్ణాటకలో దొంగలు రెచ్చిపోతున్నారు. గురువారం బీదర్‌లో ఏటీఎంకు డబ్బులు తీసుకెళ్లే వాహనంపై కాల్పులు జరిపి 98 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటనను మరువక ముందే, శుక్రవారం మంగళూరు నగరంలో దుండుగులు పట్టపగలు బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు. కోటెకర్లో ఉన్న సహకార సంఘం బ్యాంకులో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య ముసుగులు ధరించిన ఐదుగురు దొంగలు బ్యాంకులోకి దూసుకొచ్చారు. పిస్టల్, కత్తులతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఉన్న లాకర్‌ను తెరిపించారు. వాటిని కాజేసి నీలం రంగు ఫియట్ కారులో ఉడాయించారు. ఘటన జరిగినప్పుడు బ్యాంకులో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది లేరు. దోపిడీకి గురైన సొత్తు విలువ రూ.4 కోట్లు ఉంటుందని తేలింది. గురువారం బీదర్‌లో ఏటీఎంలకు డబ్బులు తీసుకెళ్లే వాహనంపై దొంగలు కాల్పులు జరిపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. దొంగల కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు సైతం మరణించడం సంచలనం రేపింది. ఈ ఘటన జరిగిన మరునాడే బ్యాంకు దోపిడి జరగడంతో కర్ణాటక పోలీసుల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళూరు నగరంలో ఉండగానే ఈ దోపిడీ జరగడం గమనార్హం. ఈ సంఘటన గురించి తెలుసుకున్న సీఎం.. పోలీసు అధికారులతో వెంటనే సమావేశమయ్యారు. ఇంత మంది పోలీసులు ఉన్నా దొంగలు ఎలా పారిపోయారని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. వెంటనే నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. దొంగలను పట్టుకునేందుకు నాలుగు జిల్లాల్లో పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.