న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై ప్రశంసలు కురిపించారు సీజేఐ బీఆర్ గవాయ్(CJI BR Gavai) నేపాల్లో జరుగుతున్న విధ్వంసాన్ని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి క్లియరెన్స్ ఇచ్చే అంశంలో దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు జరుగుతున్న సమయంలో సీజే గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన దేశ రాజ్యాంగం పట్ల గర్వంగా ఉందన్నారు. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా, నేపాల్లో ఏం జరిగిందో చూస్తున్నాము కదా అని ఆయన ఓ సందర్భంలో అన్నారు. సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలను జస్టిస్ విక్రమ్ నాథ్ సమర్థించారు. బంగ్లాదేశ్లో కూడా ఉద్రిక్త పరిస్థితుల్ని చూసినట్లు చెప్పారు.
ఈ కేసులో రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. 1970 నుంచి ఇప్పటి వరకు కేవలం 20 బిల్లులు మాత్రమే గవర్నర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 17 వేల బిల్లులు పాసైనట్లు ఆయన చెప్పారు. ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిబల్ మధ్య పరస్పర వాదనలు జరిగాయి. బిల్లులను గవర్నర్లు పెండింగ్లో పెడుతున్నారని చేసిన ఆరోపణలను మెహతా కొట్టిపారేశారు. అవన్నీ అబద్దాలు అని ఆయన అన్నారు.
గవర్నర్లు రాజ్యాంగ వ్యతిరేక సూచనలను ఫాలోకావడం సరికాదు అని తుషార్ అన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని రక్షించేందుకు బిల్లులను అడ్డుకునే శక్తి గవర్నర్లకు ఉన్నట్లు మెహతా తెలిపారు. గవర్నర్లు ప్రభుత్వానికి సేవకులు కాదు అని, కానీ వ్యక్తిగతంగా రాజ్యాంగ ఆఫీసును నడిపిస్తారని మెహతా అన్నారు.
ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నది విషయం కాదు అని, నిరవధికంగా బిల్లులను పెండింగ్లో ఉంచారా లేదా అన్నది కీలక అంశం అవుతుందని వాదనల సమయంలో జస్టిస్ జే సూర్యకాంత్ అన్నారు. ఉభయ సభలు పాస్ చేసిన బిల్లులను ఎలా గవర్నర్లు నొక్కిపెడుతారని జస్టిస్ నర్సింహా ప్రశ్నించారు.