న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని (Smriti Irani) విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా..? పీఎం మోదీతో చర్చిండచానికి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగా చర్చకు తాను సిద్ధమని రాహుల్ తరచూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
తొలుత తమ కంచుకోట అని భావించే స్థానంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలని సూచించారు. ఇక ప్రధానితో భేటీ అయి, ఆయనతో డిబేట్ చేసే స్థాయి రాహుల్‌కి ఉందా అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఏమైనా ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థా అని నిలదీశారు.
ఈ డిబేట్ వల్ల తమ పార్టీ విజన్‌ను ప్రజలు అర్ధం చేసుకోవడానికి ఈ చర్చ సాయం చేస్తుందని, సరైన సమాచారం ప్రజలకు చేరుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ చర్చకు తాను కానీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కానీ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక తటస్థ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ద హిందూ మాజీ సంపాదకుడు ఎన్ రామ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షాలు మూడు రోజుల క్రితం నేతలిద్దరికి లేఖలు రాశారు.
వాణిజ్యేతర, పార్టీయేతర వేదికపై ఈ చర్చను జరపాలని, ఇలాంటి బహిరంగ చర్చ కారణంగా ప్రజలకు అవగాహన ఏర్పడటమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించడంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఒక వేళ వారికి పాల్గొనేందుకు వీలులేకపోతే తమ ప్రతినిధులనైనా ఈ బహిరంగ చర్చకు పంపాలని వారు కోరారు.