చండీగఢ్: పంజాబ్లో రోజురోజుకు అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతున్నది. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నాకొద్ది వివిధ పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీలపై తమ విమర్శలకు పదును పెడుతున్నారు. ఓటర్లపై పోటీపడి హామీల వర్షం కురిపిస్తున్నారు. మూడు రోజుల పంజాబ్ పర్యటనకు వచ్చిన అరవింద్ కేజ్రివాల్ ( Aravind Kejriwal ) ఇవాళ ఫిల్లౌర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడుతూ.. పంజాబ్ రాష్ట్రానికి నిజాయితీగల సీఎం అవసరమని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఒకవైపు మాదకద్రవ్యాల అక్రమరవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారని.. మరోవైపు ఎప్పడూ ఎవరి నుంచీ ఒక పావలా కూడా తీసుకోని వ్యక్తి పోటీలో ఉన్నారని కేజ్రివాల్ చెప్పారు.
ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నిజాయితీపరుడని చెబుతూ అరవింద్ కేజ్రివాల్ ఈ వాఖ్యలు చేశారు. ప్రజలు ఎవరు నిజాయితీపరుడు తెలుసుకుని, ఏ పార్టీకి ఓటేస్తే నిజాయితీపరుడు సీఎం అవుతాడో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.