న్యూఢిల్లీ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. దేశంలో వైద్య విద్యను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా 41 వైద్య కళాశాలలకు కూడా ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలో వైద్య విద్యా సంస్థల సంఖ్య 816కు చేరుకుంది.
తాజా పెంపుతో దేశంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,37,600కు చేరుకుంది. పీజీ సీట్ల సంఖ్య మరో 5 వేల వరకు పెరగొచ్చని ఎన్ఎంసీ చీఫ్ అభిజిత్ తెలిపారు. కళాశాలల గుర్తింపు, సీట్ల లభ్యత, పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. 2025-26 సంవత్సరం దరఖాస్తుల కోసం నవంబర్లో పోర్టల్ ప్రారంభిస్తామన్నారు. వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి క్లినికల్ రిసెర్చ్ను ప్రధాన సిలబస్లో భాగం చేస్తామన్నారు. ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి సహకారం తీసుకొనే ఆలోచన ఉందన్నారు.