Kangana Ranaut – Congress | హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ మండి పడింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తెలివి తక్కువ ప్రకటన చేసిన కంగనా రనౌత్.. ఆ ఆరోపణలను రుజువు చేయాలని, లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. రుజువు చేయకున్నా, క్షమాపణ చెప్పకున్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు తీసుకుని సోనియాగాంధీకి మళ్లిస్తున్నదని కంగనా రనౌత్ ఆదివారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీపై కంగనా రనౌత్ వ్యాఖ్యలు ఆమె మేధో దివాళాకోరు తనాన్ని రుజువు చేస్తున్నాయన్నారు. కంగనా రనౌత్ తన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వకపోతే ఆమెపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
‘కేంద్రం నుంచి వస్తున్న నిధులను గానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులను గానీ హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి కొరకు కాకుండా సోనియాగాంధీకి పంపుతున్నారని ఆమె (కంగనా రనౌత్) చేసిన ప్రకటన అతిపెద్ద తెలివి తక్కువ ప్రకటన’ అని విక్రమాదిత్య సింగ్ స్పష్టం చేశారు. ‘కనీసం ఒక్క రూపాయి అయినా సోనియాగాంధీకి పంపినట్లు ఆధారాలు చూపాలని కంగనా రనౌత్‌ను నేను బహిరంగంగా సవాల్ చేస్తున్నా. లేని పక్షంలో నిరాధార, అవాంచనీయ ఆరోపణలు చేసినందుకు సోనియాగాంధీకి క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో కంగనా రనౌత్ మీద పరువు నష్టం దావా వేస్తాం’ అని స్పష్టం చేశారు.