న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: జీఎస్టీ, కస్టమ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ముందస్తు బెయిల్‌ను పొందవచ్చని సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాకముందే నిందితులు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని పేర్కొంది. కస్టమ్స్ చట్టం, జీఎస్టీ చట్టంలోని శిక్షా నిబంధనలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది మే 16న తీర్పును రిజర్వు చేసింది.
నేర స్మృతి, బీఎన్ఎస్ఎస్లోని యాంటిసిపేటరీ బెయిల్ నిబంధనలు కస్టమ్స్, జీఎస్టీ చట్టాలకు కూడా వర్తిస్తాయని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. జీఎస్టీ, కస్టమ్స్ కేసుల్లో అరెస్టయ్యే అవకాశమున్నవారు ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే ముందస్తు బెయిల్ పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు.