Uttarakhand Law | ఉత్తరాఖండ్‌లో పేపర్ లీక్ కేసులో కఠినమైన కాపీయింగ్ నిరోధక చట్టం తీసుకురానున్నారు. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ఉత్తరాఖండ్ పోటీ పరీక్షల ఆర్డినెన్స్ 2023 జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌తో పరీక్ష ప్రశ్నాపత్రాల లీకులు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఉత్తరాఖండ్‌లో రిక్రూట్మెంట్ స్కామ్‌కు నిరసనగా యువత రెండు రోజుల క్రితం రాజధాని డెహ్రాడూన్‌లో పెద్ద ఎత్తున ఆందోళకు దిగారు. ఈ సందర్భంగా స్పల్ప లాఠీఛార్జీ కూడా జరిగింది. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనపై సీఎం ధామి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
ఈ కొత్త చట్టం ప్రకారం.. ఏదైనా ప్రింటింగ్ ప్రెస్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదా మేనేజ్మెంట్.. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడినట్లు తేలితే వారికి జీవిత ఖైదు విధించవచ్చు. దీంతో పాటు రూ.10 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, పరీక్ష నిర్వహించే సంస్థతో ఎవరైనా కుట్ర చేసినా శిక్ష విధించే నిబంధన కూడా ఈ ఆర్డినెన్స్‌లో చేర్చారు. విద్యార్థులు దోషులుగా తేలితే వారికి మూడేండ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఇదే విద్యార్థి మళ్లీ ఇదే నేరం చేస్తూ పట్టుబడితే శిక్షను రెట్టింపు చేయనున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థుల ఆస్తులను కూడా అటాచ్ చేసేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.
రాష్ట్రంలో పోటీ పరీక్షలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందిస్తున్నది. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న గవర్నర్ 24 గంటల్లోనే ఈ చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షలకు ఈ కాపీయింగ్ నిరోధక చట్టం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాపీ క్యాట్ మాఫియాను రూపుమాపేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.