ప్రతిపక్షాల నిరసనల మధ్యే మత మార్పిడి నిరోధక బిల్లును కర్నాటక అసెంబ్లీ ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లును సభ ఆమోదించింది. ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ… ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో న్యాయ శాఖా మంత్రి మధుసూదన స్వామి జోక్యం చేసుకొని, సిద్దరామయ్యకు కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలోనే ఈ బిల్లును రూపొందించారని, అదే సమయంలో స్క్రీనింగ్ కమిటీ ముందుకు కూడా వచ్చిందని గుర్తు చేశారు. ఆ బిల్లుకే తాము కొన్ని సవరణలు చేసి, ఇప్పుడు ప్రవేశపెట్టామని మధుసూదన స్వామి పేర్కొన్నారు. కర్నాటక మతస్వేచ్ఛ హక్కు బిల్లు-2021 పేరుతో బీజేపీ ప్రభుత్వం దీనిని రూపొందించింది. బలవంతంగా కానీ, మోసపూరితంగా గానీ, సామూహికంగా గానీ ఎవరైనా మత మార్పిడులను ఈ బిల్లు నిరోధిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, 25 వేల జరిమానాను విధిస్తారు.