ఢాకా, జనవరి 5: బంగ్లాదేశ్‌లో మైనారిటీ ల భద్రత రోజురోజుకూ దిగజారుతున్నది. తాజాగా మరొక హిందువు హత్యకు గురయ్యాడు. ఐస్ ఫ్యాక్టరీ యజమాని, ఓ దినపత్రికకు యాక్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్ (45)ను మోటర్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం కోపాలియా బజార్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఆరువా గ్రామానికి చెందిన ప్రతాప్, కోపాలియా బజార్లో ఓ ఐస్ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. మోటర్ సైకిల్‌పై వచ్చిన కొంతమంది, అతడ్ని ఫ్యాక్టరీ బయటకు పిలిచి వాగ్వాదానికి దిగారని, అటు తర్వాత అతడి తలపై తుపాకీతో అనేక రౌండ్లు కాల్పులు జరిపినట్టు స్థానికులు తెలిపారు. ప్రతాప్ శరీరం నుంచి ఏడు తుపాకీ బుల్లెట్స్ లభ్యమయ్యాయి.
మైనారిటీ వితంతువుపై గ్యాంగ్ రేప్
బంగ్లాదేశ్‌లోని ఝెనైడా జిల్లాలో శనివారం రాత్రి ఓ మైనారిటీ వితంతువుపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను చెట్టుకు కట్టి, జుట్టు కత్తిరించారు. చిత్రహింసలకు గురి చేశారు. 40 ఏండ్ల వయసు గల ఆ మహిళను రెండున్నరేండ్ల నుంచి వీరిద్దరూ వేధిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. స్పృహ కోల్పోయిన బాధితురాలిని స్థానికులు కాపాడి, దవాఖానకు తరలించారు. వైద్యులు మాట్లాడుతూ, జరిగిన నేరం గురించి ఆమె చెప్పలేదని, వైద్య పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు.