ఇంఫాల్: మణిపూర్‌లో కుకీ వర్గానికి చెందిన మహిళలపై మే నెలలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకున్న బాధిత మహిళలు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. తమపై జరిగిన సామూహిక లైంగిక దాడుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాకు చెందిన 37 ఏండ్ల మహిళ తనపై జరిగిన అత్యాచారాన్ని బయటపెట్టింది (Manipur Gang Rape Horror). మే 3న మైతీ వర్గానికి చెందిన మూకలు తమ ఇండ్లకు నిప్పుపెట్టాయని తెలిపింది. దీంతో ఇద్దరు కుమారులు, మరో మహిళ, ఇద్దరు చిన్నారులతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు చెప్పింది.
కాగా, వేగంగా పరుగెత్తడంతో ఆయాసం వల్ల రోడ్డుపై పడిపోయినట్లు ఆ మహిళ తెలిపింది. పైకి లేవలేకపోవడంతో తన వెనుక కట్టుకున్న చిన్నారిని తీసుకుని పారిపోవాలని బంధువైన మహిళకు చెప్పింది. ఆ చిన్నారిని తీసుకుని వారు పారిపోగా, శక్తిని కూడదీసుకుని పైకి లేచినట్లు తెలిపింది. ఇంతలో ఆరుగురు వ్యక్తులు తనను పట్టుకున్నారని, తిట్టడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారని బాధిత మహిళ వాపోయింది. తాను ప్రతిఘటించినా ఫలితం లేకపోయిందని, వారు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ దారుణం తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని, అలాగే వ్యక్తిగత, కుటుంబం గౌరవాన్ని కాపాడుకోవడానికి, సాంఘిక బహిష్కరణ నుంచి రక్షించుకోవడానికి ఈ సంఘటనను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదని పోలీసులకు చెప్పింది.
మరోవైపు ఈ సంఘటన తర్వాత చనిపోవాలని అనుకున్నట్లు బాధిత మహిళ తెలిపింది. తనను లైంగికంగా, శారీరకంగా వేధించిన ముఠాకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరంలో ఉంటున్న ఆమెకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.