Swami Prasad Maurya | ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూమతం అనేది లేదని, హిందూమతం బూటమన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలను ట్రాప్ చేసేందుకు ఇదో ఉచ్చుంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రాహ్మణిజం మూలాలు చాలా లోతుగా ఉన్నాయన్న ఆయన.. బ్రాహ్మణిజాన్నే హిందూమతంగా పిలుస్తున్నారన్నారు. హిందూ మతం నిజానికి వెనుకబడిన, గిరిజనులు, దళితులను ఉచ్చులో పడేసే కుట్ర అని, హిందూమతంగా ఉంటే దళితులకు, వెనుకబడిన వారికి గౌరవం ఉండేదని ఎస్పీ నేత వ్యాఖ్యానించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా వేడుకలు జరుపుకున్నామని, గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని, ఆమెను గుడిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆమెకు ఉన్న బలమేంటీ? రాష్ట్రపతి ముందే మంత్రి గుడిలోకి వెళ్తారన్న ఆయన.. అలా వెళ్లడానికి కారణం ఉన్నత కులానికి చెందినవాడు కావడమేనన్నారు. ఒక వేళ ఆమె హిందువుగా ఉండి ఉంటే.. ఆమెకు అలా జరిగేది కాదన్నారు. హిందూ మతం కోసం.. మనం పిచ్చితో చనిపోవచ్చన్న ఆయన.. బ్రాహ్మణ వ్యవస్థలోని తెలివైన వ్యక్తులు మనల్ని గిరిజనులుగా పరిగణిస్తున్నారన్నారు.
భారత మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. దళితుకావడంతోనే ఆయనను ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా ఒక ఘటన జరిగిందని.. ఆయన వెనుకబడిన సమాజం నుంచి వచ్చిన వ్యక్తని.. అందుకే ఆయన పదవి నుంచి దిగిపోగానే ముఖ్యమంత్రి నివాసం, కాళిదాస్ మార్గ్‌ను గోమూత్రంతో పవిత్రంతో కడిగారన్నారు.
బాబా సాహేబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మన మహానుభావులు సుదీర్ఘ పోరాటం చేశారని, వారి ఫలితంగానే వేల సంవత్సరాల నాటి బానిసత్వం నుంచి విముక్తి పొంది నేడు గౌరవం పొందుతున్నామని స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఎస్పీ నేత గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇతిహాసం రామచరితమానస్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందులోని కొన్ని భాగాలు కులం ఆధారంగా, సమాజంలోని పెద్ద వర్గానికి అవమానకరంగా ఉన్నాయని ఆరోపించారు. ఆ భాగాలను నిషేధించాలని మౌర్య డిమాండ్ చేశారు. ఆ తర్వాత పలువురు ఆయనపై దాడులకు యత్నించారు. ఈ క్రమంలో మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.