న్యూఢిల్లీ, జూలై 12: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న ఒక మహిళ మృతదేహ భాగాలను పోలీసులు కనుగొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి 35-40 ఏండ్ల వయసున్న మహిళ మృతదేహంగా గుర్తించారు. యమునా ఖాదర్‌లో గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఉన్న పొదల్లో వేర్వేరు ప్రదేశాల్లో రెండు పాలిథిన్ బ్యాగ్‌ల్లో మహిళ మృతదేహ భాగాలు ఉన్నట్టు పోలీసులకు బుధవారం సమాచారం అందింది.
ఒక సంచిలో మహిళ తల, రెండో సంచిలో మిగతా శరీర భాగాలు కుళ్లిన స్థితిలో పోలీసులకు లభించాయి. మహిళను హత్యచేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి సంచిలో ఉంచి పారేసి ఉంటారని డీసీపీ (నార్త్) సాగర్ సింగ్ కల్సి చెప్పారు. మృతదేహం భాగాలను పోస్టుమార్టంకు పంపామని, బాధితురాలెవరన్నది ఇంకా తెలియరాలేదని తెలిపారు.