ISRO | ఇస్రో మరో మైలురాయిని సాధించింది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లోని పరీక్షా కేంద్రంలో వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను విజయవంతంగా పునఃప్రారంభించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం తెలిపింది. ఇస్రో ప్రయోగ వాహకనౌకలకు లిక్విడ్ స్టేజ్‌లకు శక్తినిచ్చేదే ఈ వికాస్ ఇంజిన్ అని చెప్పింది. ఈ నెల 17న వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను మళ్లీ మండించినట్లు పేర్కొంది. తొలుత ఇంజిన్‌ను 60 సెకన్ల పాటు.. ఆ తర్వాత 120 సెకన్ల పాటు ఆపివేసి.. మళ్లీ ఏడు సెకన్ల పాటు మండించారు. పరీక్ష సమక్షంలో అన్ని పారామితులు సాధారణంగా ఉన్నట్లు తెలిపింది. ఇంజిన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు అదనపు పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపింది.
ఇటీవల ఇస్రో నింగిలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించి.. అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును లిఖించింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్ (స్పేడెక్స్) చేపట్టింది. స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఉపగ్రహాల డాకింగ్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా మన దేశం అవతరించింది. నింగిలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసిన భారత్.. అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన సగర్వంగా చేరింది.