పంజాబ్ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుథియానా వేదికగా ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ‘చెన్నీ పేద కుటుంబం నుంచి వచ్చిన నేత. పేదరికాన్ని పూర్తిగా అర్థం చేసుకోగల నేత. పేదరికం నుంచే వచ్చారు. ఆయన మనస్సులో, రక్తంలో కూడా పంజాబ్ ఉంది. సిద్దూ రక్తంలోనూ పంజాబీ ఉంది. మీకు అనుమానం వస్తే కోసి చూడండి. రక్తం వస్తుంది. ఆ రక్తంలో పంజాబ్ వుంటుంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో సీఎం అభ్యర్థిత్వంపై తెర పడినట్టైంది. కొన్ని రోజులుగా ఇదే విషయంపై పీసీసీ చీఫ్ సిద్దూ, కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం చెన్నీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అయితే రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనకు సరిగ్గా రెండు రోజుల ముందు సిద్దూ తన స్వరాన్ని మార్చుకున్నారు. సీఎం అభ్యర్థిత్వం విషయంలో రాహుల్ మాటే తన మాట అని, సీఎంగా ఎవరు వచ్చినా, వారికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చాలా మంది డైమండ్లు ఉన్నారని, కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, అయినా సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అని రాహుల్ పేర్కొన్నారు. కేవలం 15 రోజుల్లోనే ఎవ్వరూ నేతలు కాలేరని, రోజూ టీవీల్లో కనిపించనంత మాత్రాన లీడర్లు అయిపోతారా? అంటూ రాహుల్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
20 నిమిషాలు కీలక భేటీ నిర్వహించిన రాహుల్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుథియానాకు చేరుకోగానే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం చెన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ, సీనియర్ నేత సునీల్ జాఖడ్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడే రాహుల్ వీరందరికీ చెన్నీయే సీఎం అభ్యర్థి అని చెప్పినట్లు సమాచారం. అటు సిద్దూను, ఇటు సునీల్ జాఖడ్ను రాహుల్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాతే సిద్దూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి ఎవరైనా తాను కలిసే పనిచేస్తానని, రాహుల్ గాంధీ మాట జవదాటనని సిద్దూ సభలో ప్రకటించారు.