న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోసు 129వ జయంతిని ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె అనితా బోసు ఓ డిమాండ్ చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న సుభాష్ చంద్రబోసు అస్తిక(Netaji Ashes)లను తీసుకువచ్చేందుకు భారతీయులు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ ఎక్కువ కాలం దేశం బయటే ఉన్నట్లు అనితా తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సింగపూర్‌లో ఉన్న నేతాజీ.. తైపేయిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు భావిస్తున్నారు. అయితే ఆయన అస్తికలను జపాన్‌కు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
కనీసం ప్రాణాలు పోయిన తర్వాత అయినా నేతాజీ సుభాష్ చంద్రబోసుకు మరణానంతర గౌరవం దక్కాలని అనిత అబిప్రాయపడ్డారు. సక్రమ రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఆ అస్తికలను ఇండియాకు తీసుకురావాలని ఆమె కోరారు. జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మరణానంతర గౌరవం దక్కేందుకు భారతీయులు నేతాజీ అస్తికల కోసం పోరాటం చేయాలని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.