యుద్ధ విమానాలను ఎన్ని కూలిపోయాయన్నది ముఖ్యం కాదు. ఎందుకు కూలాయన్నదే ముఖ్యం. మొదట్లో వ్యూహాత్మక తప్పిదాలు జరిగాయి. కానీ రెండు రోజుల్లోపే భారత యుద్ధ విమానాలు సుదూరంలోని పాకిస్థాన్ లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.
న్యూఢిల్లీ, మే 31: ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా భారత యుద్ధ విమానాలకు నష్టం జరగడం నిజమేని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. ఎన్ని యుద్ధ విమానాలు కూలాయన్నది ముఖ్యం కాదని, ఎందుకు కూలాయన్నదే ముఖ్యమని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సింగపూర్ షాంగ్రీ-లా చర్చలకు హాజరైన ఆయన శనివారం బ్లూమ్బర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్ట్లు పాకిస్థాన్ చేస్తున్న వాదనను గట్టిగా తోసిపుచ్చారు.
ఇందుకు సంబంధించిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… ‘ఎన్ని కూలాయన్నది ముఖ్యం కాదు. ఎందుకు కూలాయన్నదే ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. యుద్ధ విమానాల సంఖ్య ఇక్కడ ముఖ్యం కాదని, ఏం తప్పులు జరిగాయన్నదే ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ నష్టం జరిగిన తర్వాత భారత యుద్ధ విమానాలు రెండు రోజుల లోపే సుదూరంలోని పాకిస్థాన్ లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయని ఆయన తెలిపారు. ‘ఇందులో మంచి విషయం ఏమిటంటే మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాలను త్వరగా తెలుసుకుని సరిదిద్దుకుని రెండు రోజుల తర్వాత మరోసారి అమలు చేశాం. సుదూర లక్ష్యాలపై మరోసారి మా నాలుగు యుద్ధ విమానాలు దాడులు చేశాయి’ అని ఆయన తెలిపారు.