Payyavula Keshav : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తన గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. సాక్షాత్తు ఏపీ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సంపదను పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని జగన్పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బిల్లులను పెండింగ్లో పెట్టడంతో అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారని, పోలవరం పనులు నిలిపివేసి డయాఫ్రమ్ వాల్ డ్యామేజీకి జగన్ కారణమయ్యారని పయ్యావుల ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అంకెల గారడీతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పు దారి పట్టించిందని విమర్శించారు. ఇప్పుడు కూడా అంకెల గారడీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్లో పెట్టారని, పిల్లలకు ఇచ్చే చిక్కీల బిల్లులను కూడా పెండింగ్లో పెట్టారని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. ఫీజు రీయంబర్స్ చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. తాము వచ్చాకనే సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.