కోల్‌కతా, ఆగస్టు 22 : దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 931 కోట్ల మేరకు ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ. 332 కోట్ల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆమె ఆస్తుల విలువ కేవలం రూ. 15 లక్షలకు కొద్దిగా ఎక్కువ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో పొందుపరిచిన ఆస్తుల వివరాల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోని 31 ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ. 1,630 కోట్లని నివేదిక పేర్కొంది.
తనకు రూ. 15 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు మమతా బెనర్జీ ప్రకటించగా జమ్ము కశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆస్తులు రూ. 55 లక్షలని ఏడీఆర్ తెలిపింది. ఆస్తుల విషయంలో కింది నుంచి మూడవ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నారు. ఆయనకు రూ. 1 కోటి మేర ఆస్తులు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ 30న జరిగిన భొవానీపొర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా మమతా బెనర్జీ అఫిడవిట్ దాఖలు చేశారు. 2020-21లో దాఖలు చేసిన ఆదాయం పన్ను రిటర్న్స్‌లో ఆమె రూ. 15.4 లక్షల ఆస్తులు చూపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మమత ఆస్తులు రూ. 30.4 లక్షలు ఉన్నాయి. తన వద్ద రూ. 69,255 నగదు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 13.5 లక్షలు ఉండగా అందులోనే ఆమె ఎన్నికల ఖర్చులను రూ. 1.5 లక్షలు చూపారు. తన వద్ద రూ. 43,837 విలువచేసే 9 గ్రాముల బంగారం ఉన్నట్లు మమత తెలిపారు. తన పేరిట స్థలం కాని, నివాస గృహం కాని ఉన్నట్లు ఆమె తన అఫిడవిట్లో పేర్కొనలేదు.