ముంబై, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘సెలవులకు ఇంటికి వెళ్లి వస్తే చాలు మాకు గర్భధారణ పరీక్షలు చేయిస్తున్నారు, ఇది మాకు అవమానంగా ఉంది. మా ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బ తీస్తున్నది’ పుణె జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలివి. దీనిని వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. టెస్టింగ్ ప్రక్రియ అవమానకరంగా ఉందని విద్యార్థినులు అంటున్నారు. పైగా, దీనికయ్యే ఖర్చు రూ.150-200 ఖర్చును తామే భరించాలని చెప్తున్నారు.
‘దీనికి వ్యతిరేకంగా మేం పదేపదే నిరసన వ్యక్తం చేస్తున్నాం. బాలికలకు యూపీటీ పరీక్ష చేయించడం అంటే, వారిని మానసికంగా హింసించడమే. దీనిని వెంటనే ఆపాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని ఎస్ఎఫ్ఐ పుణె జిల్లా అధ్యక్షురాలు సంసృతి గోడే అన్నారు. ఫుణెలోని ఒక హాస్టల్లో గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో, రాష్ట్ర మహిళా కమిషన్ ఆ పరీక్షలు నిలిపివేయాలని ఆదేశించింది.