uddhav-ajit pawar| ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత అజిత్ పవార్.. ఉద్ధవ్‌తో సమావేశం కావడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ భేటీ జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బెంగళూరులో విపక్షాలు నిర్వహించిన సమావేశానికి ఉద్ధవ్ ఠాక్రే హాజరైన మరుసటి రోజే ఈ భేటీ జరుగడం గమనార్హం. ‘అజిత్ పవార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపాను. ప్రజలకు ఆయన మంచి చేస్తారని ఆశిస్తున్నా. 2019లో ఆయనతో కలిసి పనిచేశా. ఆయన పనితీరు నాకు తెలుసు’ అని సమావేశం అనంతరం ఉద్ధవ్ మీడియాతో వ్యాఖ్యానించారు.
ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే శివసేనలో ఏకనాథ్ షిండే తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో జత కలవడంతో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఇటీవల ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి షిండే ప్రభుత్వంలో చేరడం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చివేసింది.