శ్రీనగర్, జూలై 7: జమ్ముకశ్మీర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. కన్నతల్లులు ఏడుస్తూ చేసిన విజ్ఞప్తులతో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం కుల్గాం జిల్లాలో జరిగింది. భద్రతా బలగాలు మంగళవారం రాత్రి హదిగాం గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా ఓ ఇంట్లో దాక్కొన్న ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులుకు పాల్పడ్డారు. వీరిద్దరు స్థానికులని గుర్తించిన అధికారులు.. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని తపన పడుతున్న కుటుంబసభ్యులను ఆపరేషన్ సైట్కు తీసుకొచ్చారు.
‘బయటకు రా బిడ్డా. నేను నీ తల్లిని. నువ్వు ఏమైనా తప్పు చేసుంటే నీ తరపున సైన్యాన్ని నేను క్షమాపణ కోరుతాను’ అని ఓ తల్లి ఏడుస్తూ తన కొడుకుకు విజ్ఞప్తి చేసింది. సరెండర్ అవ్వాలని తల్లిదండ్రులు, బలగాలు చేసిన విజ్ఞప్తులతో ఉగ్రవాదులు ఆయుధాలు పడేసి ఇంటి నుంచి బయటకు రాగా, బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఇద్దరు యువకులను లష్కరే తాయిబా ఇటీవల రిక్రూట్ చేసుకున్నట్టు ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొన్నది.