లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగున్న మహా కుంభమేళాకు (Maha Kumbh) కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ నేపథ్యంలో మహా కుంభమేళా గడువును పొడిగించాలని యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ‘ఇప్పుడు చాలా మంది మహా కుంభ్‌కు వెళ్లాలని కోరుకుంటున్నారు. కానీ వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మహా కుంభ్ సమయ పరిమితిని ప్రభుత్వం పొడిగించాలి’ అని అన్నారు.
కాగా, గతంలో మహా కుంభ్, కుంభమేళా 75 రోజులు కొనసాగినట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళా గడువు తక్కువగా ఉందని చెప్పారు. మహా కుంభమేళకు వెళ్లలేని భక్తుల కోసం గడువును ప్రభుత్వం పొడిగించాలని కోరారు. గత నెలలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం దాచిందని ఆయన ఆరోపించారు.
మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది. దీంతో ముగింపు గడువు సమీపిస్తుండటంతో కుంభమేళాకు దారితీసే రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అలాగే అధిక జన సమూహం కారణంగా ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు.