జకర్తా, డిసెంబర్ 14: ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. మౌమెరె పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్ర గర్భంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలను జారీ చేసిన అధికారులు, తరువాత ఉపసంహరించుకున్నారు. భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సెలేయార్ ద్వీపంలో ఒక స్కూల్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.