న్యూఢిల్లీ: దాదాపు 24 ఏండ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తిని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చదివింది కరెక్టే. 24 ఏండ్ల క్రితం చచ్చిన వ్యక్తే ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. అదెలా సాధ్యం..? ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఇప్పుడు పోలీసులకు చిక్కడమేంటి అని ఆలోచిస్తున్నారా..? అయితే పూర్తి వివరాల కోసం కింది వార్తలోకి వెళ్దాం..
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 1991లో దొంగతనం చేశాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ చిక్కలేదు. 1998లో అతను మరణించాడని ధృవీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన డెత్ సర్టిఫికెట్ కూడా పోలీసులకు అందింది. దాంతో అప్పటి నుంచి పోలీసులు అతని కోసం వెతకడం ఆపేశారు.
కోర్టు కూడా ఆ కేసు ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల అతడు బతికే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దొంగతనం కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఫోర్జరీ సంతకంతో డెత్ సర్టిఫికెట్ సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కాగా, కేసుకు సంబంధించి నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నట్లు ఢిల్లీ అవుటర్ నార్త్ జిల్లా డీసీపీ దేవేశ్ కుమార్ చెప్పారు.